Tuesday, March 29, 2022

వర్షాకాలంలో కోళ్ళ పెంపకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 వర్షాకాలంలో కోళ్ళ పెంపకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు


    

కోళ్ళ రైతులు రానున్న వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోళ్ళ మరణాల శాతం తగ్గించుకొని, అధిక గ్రుడ్లు మరియు మాంసము తక్కువ ఖర్చులో పొందవచ్చును.

వర్షాకాలంలో కోళ్ళపెంపకంలో ఎదురయ్యే సమస్యలు:

01. వర్షాకాలంలో ప్రధానంగా వాతావరణంలోని తేమ వలన కోళ్ళ దాణా మరియు బ్రాయిలర్ కోళ్ళ లిట్టర్ తడిగా అవడం వంటి సమస్యలు వస్తాయి.

02. వర్షాకాలంలో నీరు కలుషితం అవడం వల్ల ఇ.కొలై వంటి బాక్టీరియా సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

03. ఫారం పరిసరాలలో నీరు నిలువ ఉందటం వల్ల దోమలు, ఇతర వ్యాధి సంక్రామిక కీటకాలు ఎక్కువయి కోళ్ళలో ఫాక్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

04. ఫారంలో తేమ, నీరు, తడి లిట్టర్ ఎక్కువగా ఉండుట వల్ల ఈగలు అధికమై కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.

05. లిట్టర్ లో అధిక తేమ ఉండుటవల్ల అమోనియా వాయువు ఎక్కువగా ఏర్పడి కొరైజా మరియు సి.ఆర్.డి. వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి.

06. దాణా మరియు దాణాలో తయారీకి వాడే పదార్థాలు (మొక్కజొన్నలు, తవుడు) మెదలైనవి తడిసినచో వాటిలో అఫ్లోటాక్సీన్లు మరియు ఇతర మైకోటాక్సీన్లు ఉత్పత్తి జరుగుతుంది. మైకోటాక్సీన్ల వల్ల కోళ్ళలో కాలేయం చెడిపోవుట, కోళ్ళు కుంటివి అవటం, గ్రుడ్లు ఉత్పత్తి తగ్గడం, ఎఫ్.సి.ఆర్. తగ్గడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాక్సిన్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

07. వర్షాకాలంలో ఆకాశం మబ్బులు పట్టి ఉండటం వంటి కారణాల వల్ల పగటి పూట వెలుగు ఉండే సమయం 12 గం. కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల కోళ్ళలో గ్రుడ్ల ఉత్పత్తికి అవసరమైన ఎఫ్.ఎస్.హెచ్. మరియు ఎల్.ఎచ్. వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గి గ్రుడ్ల సంఖ్య తగ్గిపోతుంది.

08. ఈ కాలంలోఎక్కువ మొత్తంలో దాణా 30 రోజులకంటే ఎక్కువగా నిల్వ ఉన్నట్లయితే దాణాలో మైకోటాక్సీన్లు, రాన్సిడిటి వంటి సమస్యలు వస్తాయి.

09. వర్షాకాలంలో  ఒక్కసారి విపరీతమైన గాలి, తుఫాన్లు వంటి వాటివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గటం వంటి సమస్యలు వస్తాయి. చెట్లుపడిపోవటం, రోడ్ల రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడం వంటి సమస్యల వల్ల దాణా రవాణాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

10. విద్యుత్ అంతరాయం మరియు చలి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లల బ్రూడింగ్  సమస్యలు వస్తాయి.

11.  వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఆస్పర్జీల్లోసిస్ వంటి సమస్యలు వస్తాయి.

12.  వర్షాకాలంలో కాక్సిడియోసిస్, మశూచి, కొరైజ, తీవ్రశ్వాసకోశవ్యాధి, ఇ.కొలై, సాల్మోనెళ్ల,  ఆస్పర్జీల్లోసిస్ మరియు మైకోటాక్సికోసిస్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.

వర్షాకాలంలో కోళ్ళ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

·         వర్షాకాలం రాకముందే షెడ్డు పై కప్పు, గోడలు మరియు గోదాము ఫ్లోరింగ్ లలో ఏవైనా రిపేర్లుఉంటే చేసుకోవాలి.

·         కోళ్ళ షెడ్డు పై కప్పు గోడ నుండి 4-5 దూరం వరకు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు నేరుగా షెడ్డులో పడకుండా ఉంటుంది.

·         షెడ్డుకు అన్ని వైపులా ఫాలిథిన్ కవర్లను కప్పి ఉంచాలి. దీని వల్ల వర్షపు నీరు నేరుగా షెడ్డులో పడకుండా ఉంటుంది మరియు తీవ్రమైన చలి గాలుల నుండి కోళ్ళను కాపాడుకోవచ్చు.

·         కోళ్ళఫారం చుట్టూ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల దోమలు వంటివి వ్యాప్తి చెందకుండా చూడవచ్చు.

·         షెడ్డు చుట్టూ ఉన్న ఫాలిథిన్ కవర్లను వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు మాత్రమే కప్పి ఉంచాలి. లేనిచో కోళ్ళ షెడ్లలో సరియైన గాలిప్రసరణ జరగక అమ్మోనియా వాయువు శాతం పెరగడం, కోళ్ళలో ఎదుగుదల తగ్గడం మరియు కొరైజ వంటి శ్వాసకోశ సమస్యలు, ఆసైటీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

నీటి యజమాన్యం:

·         వర్షపునీరు, బోర్లు మరియు బావులలోనికి నీరు ఇంకే ప్రక్రియలో నీటిలో బాక్టీరియా వంటివి చేరి నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది.

·         నీళ్ళలో మంచి సానిటైజర్ మరియు అసిడిఫెయర్ వంటివి క్రమం తప్పకుండ వాడటం వల్ల నీటిలో ఉన్న బాక్టీరియాను క్రియారహితం చేయవచ్చు.

·         వర్షాకాలంలో నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. కాబట్టి కోళ్ళను ఎల్లప్పుడు పరిశుభ్రమైన నీరు అందించాలి మరియు తరచు కోళ్ళ ట్యాంకులను శుభ్రపరచుకోవాలి.

దాణా యజమాన్యం:

·         వర్షాకాలంలో వాతావరణం తేమ అధికంగా ఉంటుంది మరియు షెడ్డులో నెల కూడా తడిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాణా బస్తాలు నేరుగా నేలపై ఉంచకుండా చెక్క బల్లల వంటివి వేసి ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.

·         దాణా బస్తాలు మరియు ఇతర దాణా తయారీకి వాడే ముడి పదార్థాలను దాణా గోదాంలలో దూరంగా ఉండేలా చూసుకోవాలి.

·         వర్షాకాలంలో కాక్సిడియోసిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల దాణాలో కాక్సిడియోస్టాట్లు కలపడం వల్ల కాక్సిడియోసిస్ వ్యాధిని నివారించవచ్చు.

·         వర్షాకాలంలో ఒక్కసారి తుఫాన్లు, రోడ్డు రవాణాలో అంతరాయం వంటివి కల్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ 4-5 రోజులకు సరిపడే దాణా నిల్వ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

·         వర్షాకాలంలో 30 రోజుల కంటే ఎక్కువగా దాణా నిల్వ ఉంచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న దాణాలో మైకోటాక్సీన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

·         దాణాతోట్టెలో వర్షపు నీరు పడినట్లయితే వాటిలోని దాణాను తీసివేసి శుభ్రంచేయాలి.

·         దాణాలో వివిదరకాలైన మైకోటాక్సీన్లను నివారించే మల్టీమైకోటాక్సిన్ బైండర్ ను సరియైన మోతాదులో క్రమం తప్పకుండ కలపాలి.

·         దాణాలో టాక్సిన్ బైండర్ తో పాటు లివర్ స్టీమ్యులెంట్ పౌడర్ను కలపడం వల్ల కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

కాంతి యజమాన్యం:

·         వర్షాకాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది, కాబట్టి కృత్రిమ కాంతి ఇవ్వడం వల్ల కోళ్ళు ఎక్కువ దాణా తినడమే కాకుండా ఎక్కువ గ్రుడ్లు పెడతాయి.

·         గ్రుడ్లు పెట్టె కోడికి 16 గం. క్రాంతి అవసరం అవుతుంది. పగటి పూట లభించే 12 గం. తో పాటు అదనంగా కృత్రిమ కాంతిని ప్రొద్దునగాని సాయంత్రంగాని లేదా ఆ రెండు సమయంలలో ఇవ్వాలి.

·         కాంతినిచ్చే సమయంతో పాటు, కాంతి తీవ్రత కూడా కోడిగ్రుడ్ల ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది. కాంతి తీవ్రత 20-40 వాట్ లు ఉండాలి.

కాక్సీడియోసిస్:

            చెమ్మగిల్లిన, అట్టలు కట్టిన లిట్టరులో వ్యాధికారక ప్రోటోజోవా వృద్ది చెందడం వలన కాక్సీడియోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది. రైతులు నివారణగా పిల్లల దాణాలో కాక్సిడియోస్టాట్ మందులను వాడుతున్నారు. అయినప్పటికి లిట్టరు యజమాన్యం కష్టం కావడంతో వ్యాధి సంక్రమిస్తుంది. వర్షాకాలంలో నీటి వినియోగం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఫలితంగా వ్యాధి సంక్రమించిన సందర్భాలలో నీటి ద్వారా ఇవ్వబడే మందులు కొన్నిసార్లు తగిన ఫలితాలనివ్వకపోవచ్చు. కనుక, కాక్సీడియోసిస్ వ్యాధి నిర్ధారణ కాగానే వ్యాధి తీవ్రతను బట్టి, వాతావరణాన్ని బట్టి కోళ్ళు తిసుకొనే  నీటి మోతాదుని బట్టి మందులనివ్వాల్సి వుంటుంది. వ్యాధి నివారణలో లిట్టరు యజమాన్యం అత్యంత ప్రాధాన్యతను కలిగి వుంది. లిట్టరును చెమ్మగిల్లకుండా క్రమం తప్పక దున్నుతుండాలి. అప్పుడప్పుడు సున్నం జల్లుతుండాలి.



ఇ.కొలై

    వర్షాకాలంలో కలుషితమైన నీటి వాడకం వలన కోళ్ళకు యిది సంక్రమిస్తుంది. కురిసే వర్షపు నీరు బోర్లలోనికి, బావుల లోనికి యింకే ప్రక్రియలో నీరు కలుషితమయ్యే అవకాశం వుంది. క్రమం తప్పక సానిటైజర్ ను నీటిలో కలుపడం ద్వారా ఈ సమస్య నివారణ సాధ్యమవుతుంది. తరుచూ నీళ్ళ ట్యాంకులను శుభ్రపరచుకోవాలి.



నెక్రొటిక్ ఎంటిరైటీస్:

    అధిక స్థాయిలో చెమ్మను కలిగిన జంతుసంబంధిత మాంసకృత్తులలో అనేక వ్యాధి కారక బాక్టీరియా తేలికగా వృద్ది చెందుతాయి. అటువంటి ముడి పదార్థాలను తీసుకున్న కోళ్ళలో సాల్మొనెల్లా, ఫౌల్  కలరా, కొరైజా, నెక్రొటిక్ ఎంటిరైటీస్ వంటి సమస్యలెదురావుతాయి. నాణ్యతను గుర్తించి ముడిపదార్థాలను వాడుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు లొంకోమైసిన్, జింక్ బాసిట్రాసిన్, టెట్రాసైక్లిన్ వంటి మందులను ఇవ్వాలి.



కొరైజా సి.ఆర్.డి.:

    కొరైజా సి.ఆర్.డి. వంటి బాక్టీరియాల్ వ్యాధులు కూడా వర్షాకాలంలో ఎక్కువగా సంక్రమిస్తుంటాయి. వీటికి తోడు కలుషిత నీటి వాడకం వలన సమస్య తీవ్రమవుతుంది. కొరైజా సి.ఆర్.డి. సమస్యలకు యింజక్షన్ల నివ్వడమే సరియైనది.



అఫ్లాటాక్సీన్ల సమస్య:

    అధిక స్థాయి చెమ్మ కలిగిన ముడి పదార్థాలు ఎక్కువ రోజులపాటు నిలువ వుంచబడిన తయారైన దాణా వంటి వాటిలో టాక్సీన్లు తేలికగా వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో టాక్సీన్ల సమస్య ఎక్కువ. కలుషిత దాణాను తీసుకున్న కోళ్ళలో వ్యాధి నిరోధకత క్షీణిస్తుంది. ఉత్పాదకతలు క్షీణిస్తాయి. ఎక్కువ రోజుల పాటు సమస్య నెదుర్కొంటున్న కోళ్ళలో మరణాలు కూడా ఉంటాయి. నాణ్యతను గుర్తించి ముడి పదార్థాలను వాడుకోవాలి. సమస్య నివారణకు క్రమం తప్పక టాక్సిన్ బైండర్లనివ్వాలి.





 

No comments:

Post a Comment

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...