Tuesday, March 29, 2022

వర్షాకాలంలో పశుసంరక్షణ, పశు పోషణ

 వర్షాకాలంలో పశుసంరక్షణ, పశు పోషణ


 వర్షాల నుండి పశువులను సంరక్షించుకోవడం మరియు వాటి పశు పోషణ చూసుకోవడం పశు పోషకులకు చాలా అవసరం.   

భారీవర్షాలు, వరదలు ఉన్న ప్రాంతంలో రైతులు అప్రమత్తంగా ఉండి, పశువులను వీలైనంత త్వరగా మెరక ప్రాంతాలకు తరలించాలి. లోతట్టు ప్రాంతాలలో, వరద పరీవాహక ప్రాంతాలలో ఉండే వారు పశువులను, పెంపుడు జంతువులను కట్టివేయకుండా స్వేచ్చగా తిరిగేలా వదిలేయలి. ఒకవేళ వరద ఉధృతి పెరిగి నీరు వచ్చినపుడు పశువుకు తప్పించుకునే అవకాశం ఉన్న కట్లు తెంచుకోలేక ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.

వర్షాలు ముగిసిన తరువాత కూడా పశువులకు అందజేసే ఎండు మేత, దాణాలను పొడి ప్రదేశంలో ఉంచుకోవాలి. లేదంటే వర్షానికి తడిచిన మేత, దాణా బూజు పట్టి టాక్సిన్ లు (విష పదార్థాలు) పెరిగి వాడడానికి పనికి రాకుండాపోతాయి.

పశు సంరక్షణ:

·         పశువులను ఎండ, వాన మరియు చలి నుండి కాపాడ గలిగె పాకలలో ఉంచినప్పుడు మాత్రమే అవి వాటి సామర్థ్యం మేరకు పాలను ఇవ్వటం గాని ఆరోగ్యంగా ఉండటం గాని జరుగుతుంది. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులను బయటకు మేతకు వదలకుండా పాకాలోనే ఉంచాలి.



·            పాకలలో నీరు కారకుండా పైకప్పులకు ముందుగానే మరమ్మత్తులు చేయించుకోవాలి. పాకలలో నీరుచెరటం వల్ల కాక్సిడియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే మేకలలో గిట్టలు కుళ్లిన వ్యాధి వస్తుంది. మురికిగా ఉన్న పాకాల వల్ల పాడి పశువులలో పొదుగు వాపు వ్యాధి వస్తుంది కావున, పరిశుభ్రత పాటించాలి.



·         పశువులు వర్షాకాలంలో వ్యాధులను వ్యాపింపచేసే బాహ్యపరన్న జీవులైన ఈగలు, దోమలు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉంది, కావున పాకాల దగ్గర మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి. అలాగే పురుగుల మందులను పాక చుట్టు పిచ్చికారి చేయాలి

·         పశువులు వర్షాకాలంలో మురికి నీరు తాగకుండా జాగ్రత్తపడాలి. త్రాగు నీరు పరిశుభ్రంగా అందించాలి.

వాతావరణంలో మార్పులు మరియు మేతలో మార్పుల కారణంగా పశువులు ఈ సమయంలో శరీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.

పశు పోషణ:

·         వర్షాకాలంలో మేపే పచ్చిగడ్డిలో ఎక్కువగా నీటి శాతం ఉండటం వల్ల పశువు ఎక్కువ మేత తీసుకోలేదు మరియు పేడలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కావున  రైతులు వర్షాకాలంలో పచ్చి పశుగ్రాసాన్ని కోసి ఎండ బెట్టడం వల్ల నీటి శాతాన్ని తగ్గించి మంచి పశు మేతగా అందించవచ్చు.

·         ఎడతెరపని వర్షాలలో పశువులను మేతకు పంపడం సాధ్యం కాదు. కావున ముందే ప్రణాళికబద్దంగా గడ్డిని నిల్వ ఉంచుకోవాలి. పశుగ్రాస కొరత ఉన్నప్పుడు పశువులు తడిసిన ఎండుగడ్డిని సైతం తినడానికి ఇష్టపడతాయి, కానీ అటువంటి తడిసిన గడ్డిలో సూక్ష్మక్రిములు, విష పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున పశువులు తడిసిన గడ్డిని తినకుండా జాగ్రత్త వహించాలి.

·         రైతుల దగ్గర దాణా ఉన్నచో వరద ఉధృతి తగ్గే వరకు పశువులను దాణాపై మేపడం ఉత్తమం. వరదల సమయంలో గడ్డి కంటే కూడా గింజలు లేదా చెక్కలు సులభంగా రవాణా చేసుకోవచ్చు. కావున రైతులు వీటిపైన తాత్కాలికంగా పశుపోషణ చేసుకోవడం మంచిది.

·         వరద ఉధృతి తగ్గిన తరువాత కూడా నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో కూడా పశువులను మేతకు వదలకూడదు. పశువులను ఇంటి వద్దనే ఉంచి అందుబాటులో ఉంటే కంది పొట్టు, ఉల్వ పొట్టు, గింజల చెక్కలు, చొప్ప లాంటి వాటితో పశుపోషణ చేసుకోవాలి. తడిసిన వరిగడ్డిని సాద్యమైనంత త్వరగా ఆరబెట్టి కాపాడుకోనే ప్రయత్నం చేయాలి, లేకుంటే పశుగ్రాసకొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

·         వర్షాకాలంలో పచ్చికబయళ్లలోఖనిజ లవణాలు తక్కువగా లభిస్తాయి. కావున ప్రతి పశువుకు 50 గ్రాముల ఖనిజలవణ మిశ్రమం అంధించాలి.  

తడిచిన గడ్డిని ఎండబెట్టు పద్దతి:

తడిసిన గడ్డిలో 0.5 – 1 శాతం ఉప్పు కలిపి నిల్వ ఉంచడంద్వారా బూజు ఏర్పడకుండా కొద్ది రోజులు కాపాడుకోవచ్చు. తడిచిన గడ్డిని లేదా ధాన్యాన్ని తేమ 15 శాతం కంటే తక్కువ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత మాత్రమే పశువులకు మేతగా అందించాలి.

కొద్దిగా తడిచిన గడ్డిని 3 శాతం యూరియా ద్రావణంలో కలిపి చిన్న గుంటలో పాతర వేసుకోవడం మంచిది. పచ్చిక పైర్లు పూర్తిగా నీటిలో మునిగి ఉండే సమయంలో మేతగా అందించే చెట్ల రకాలైన ఆవిశ, సుబాబుల్, గ్లైరిసిడియా వంటి వాటిని మేతగా ఇంటి వద్దనే అందించాలి.

వరదల సమయంలో పశువులలో వ్యాప్తి చెందే వ్యాధులు- నివారణ:

·         వరద సమయంలో వాతావరణంలోని చల్లదనం మరియు తేమ కారణంగా వైరస్, బాక్టీరియా తదితర హానికరమైన సూక్ష్మక్రిములు వృద్ది చెంది పశువులకు ఆంత్రాక్స్, జబ్బవాపు, పచ్చిక దోమ, కాలి పుండు వ్యాధి, న్యుమోనియా, పొదుగు వాపు వంటి వ్యాధులు కలిగిస్తాయి. కావున రైతులు పశువులకు ముందుగానే అంధుబాటులో ఉన్న వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి.

·         అధిక పాల దిగుబడినిచ్చే పాడిపశువుల నుండి పాలు ఒక్కసారిగా పితకడం ఆపివేయకూడదు. అలా చేయడం వల్ల పశువులకు పొదుగువాపు వ్యాధి సోకి, శాశ్వతంగా పాడికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తవహించాలి.

·         జలగ వ్యాధి రాకుండా నత్తలను నిర్మూలించాలి. నత్తలుండే పచ్చిక బయళ్ళలో మైలతుత్తం ఒక భాగం, ఇసుక ఆరు భాగాలు కలిపి ఏకరాకు 15-20 కిలోల చొప్పున చల్లాలి.

·         భారీ వర్షాలు మరియు వరదల కారణంగా పశువులలో బాహ్య, అంతర పరాన్న జీవుల వల్ల వ్యాధిగ్రస్తం కాకుండా ముంధుగానే పశువైద్యులనులను సంప్రదించి ముందుగానే తగు మందులను వాడుకోవాలి.

 వరదల సమయంలో పశువులు చనిపోయి ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలంటే ముందుగానే పశువులన్నింటికి భీమా చేయించడం మంచిది. వర్షాలు మరియు వరద సమయంలో పశువులు చనిపోయినట్లయితే వాటిని లోతైన గుంత తవ్వి, సున్నం చల్లి పూడ్చి పెట్టాలి లేదా కాల్చివేయాలి. దీని వల్ల అంటువ్యాధులు ప్రభాలకుండా ఉంటాయి. వర్షంలో బాగా తడిసిన పశువులలో శరీర ఉష్ణోగ్రత తగ్గి, అనారోగ్యపాలవుతాయి కావున వెంటనే పశు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి.       

 

 

No comments:

Post a Comment

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...