Tuesday, March 29, 2022

సంవత్సర పొడువునా పశుగ్రాసాలకై ప్రణాళిక

 సంవత్సర పొడువునా పశుగ్రాసాలకై ప్రణాళిక

మేలిజాతి పాడిపశువు ఒకఎకరం పొలంలో వచ్చేకాపు కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. కానీ లాభదాయాకమైన పశుపోషణకు సమగ్ర ప్రణాళిక అవసరం. పాడి పశువుల పెంపకంలో 60-70శాతం పశుపోశనకే  ఖర్చుఅవుతుంది. సరే ఖర్చుకు వెనకాడకుండా పాడిఆవుకు సరియైన పోషణ అందిధాం అంటే సంవత్సర పొడుగు పశుగ్రసాలు లభ్యం కావట్లేదు. కానీ కొద్ది పాటి ప్రణాళికతో సరియైన అవగాహనత ఉంటే పాడిపశువుకు అవసరమైన పశుగ్రాసాలని పెంచుకోవచ్చు.

ఒక పాడి పశువుకు రోజుకు 25-30 కి.గ్రా.ల పచ్చిగడ్డి, 5కి.గ్రా.ల ఎండు గడ్డి, 2 కి.గ్రా దాణా అవసరం ఉంటుంది. 5 లీటర్లకు పైగా పాలు ఇచ్చే పశువులకు, గేదె అయితే ప్రతి 2లీటర్లకు/ ఆవు అయితే ప్రతి 2.5 లీటర్లకు ఒక కి.గ్రా. దాణా అదనంగా ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా పశువుకు ఇచ్చే గ్రాసంలో 2/3 పాళ్ళు కాయ జాతి, 1/3 పాళ్ళు పప్పు జాతి పశు గ్రాసాలని అందించవలసి ఉంటుంది.

10 పాడి పశువులు, 5దూడలకు సంవత్సరానికి కావాల్సిన పచ్చిమేతకై 2.5 ఎకరాలలో పశుగ్రాసాలని సాగు చేయవలసి ఉంటుంది.

·         రోజువారీ పశుపోషణ, భవిష్యత్తు అవసరాలనిల్వ అంచనా వేస్తె ఒక పాడిపశువుకు ఒక రోజుకి 40 కి.గ్రా. పచ్చిగడ్డి అవసరం.

·         10 పాడి పశువులకు ఒక రోజుకు కావలసిన పచ్చిగడ్డి: 40*10= 400 కి.గ్రా.లు

·         ఒక సంవత్సరానికి 10 పాడి పశువులకు కావలసిన పచ్చిగడ్డి: 400*365= 146టన్నులు

·         ఒక దూడకు ఒక రోజుకు కావలసిన పచ్చిగడ్డి: 15 కి.గ్రా.లు

·         5 దూడలకు ఒక రోజుకు కావలసిన పచ్చిగడ్డి: 15*5=75 కి.గ్రా.లు

·         ఒక సంవత్సరానికి 5దూడలకు కావలసిన పచ్చిగడ్డి: 75*365= 27.42 టన్నులు

·         10పశువులకు, 5దూడలకు ఒక సంవత్సరానికి కావలసిన పచ్చిగడ్డి: 146+27.4=173 టన్నులు

173 టన్నుల పచ్చిమేతకు ఒక హెక్టారు(2.5 ఎకరాలు) పోలంలో 60%ను బహు వార్షికాలయిన హైబ్రిడ్ నేపియర్, ల్యుసర్న్, హెడ్జ్ ల్యుసర్న్ లను సాగుచేసుకొని మిగతా ఒక ఎకరంలో ఏక వార్షికైనా జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, గోరు చిక్కుడు పశుగ్రాసాలను సాగు చేయాలి.

1.5 ఎకరంలో: బహు వార్షికాలయిన హైబ్రిడ్ నేపియర్ లను జూన్ మెదటి వారంలో నాటాలి. ఈ పంటలో బహు వార్షిక పప్పుజాతి హెడ్జ్ ల్యుసర్న్పంటను అంతర పంటగా 3:1 నిష్పత్తిలో సాగుచేసుకోవచ్చును.  మొదటికోతను 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజులకు తీసికొని ఆరు కోతల్లో 1.125 ఎకరానికి 112 టన్నుల పచ్చిమేత వస్తుంది. అదే విధంగా అంతరపంట అయిన హెడ్జ్ ల్యుసర్న్ 8.0 టన్నులు దిగుబడివస్తుంది.

 



నేపియర్ సాగు చేయు పద్ధతి:

రకములు: యన్.బి.21, ఎ.పి.బి.యన్.,కో-1,కో-2. 

హెక్టారుకు కావలసిన కాండపు మొక్కలు: 30వేల రెండు కణుపుల  కాండపు ముక్కలు, ఒకసారి నాటితే 3-4 సంవత్సరాలు ఉంటుంది. 

నాటు పద్దతి: వరుసలలో, వరుసల మధ్య అంతరము 60X60 సెం.మీ. 

ఎరువులు హెక్టారుకు: 110 కిలోల యూరియ,50కిలోల భాస్వరం,40కిలోల పొటాషియం

నీటితడులు: ఎండాకాలములో 8-10 రోజులకు ఒకసారి, చలికాలంలో 15-20 రోజులకి ఒకసారి 

మెదటికోత: నాటిన తర్వాత 60-75 రోజులకు కోతలు: ప్రతి 40-45 రోజులకు ఒకసారి, 6-8కోతలు/సంవత్సరానికి

దిగుబడి హెక్టారుకు: పచ్చిమేత 250-300 టన్నులు

హెడ్జ్ ల్యుసర్న్ (దశరథ గడ్డి) సాగు చేయు పద్ధతి:

విత్తనం: 2-2.5 కిలోలు ఎకరానికి 

నాటు పద్దతి:సాళ్ళలో50 సెం..మి. ఎడంగా విత్తుకోవాలి లేదా నారు పోసి  50 సెం..మి. ఎడంగా నాటుకోవాలి 

ఎరువులు ఎకరానికి: 8 కిలోల నత్రజని,౨౪కిలోల భాస్వరం,12కిలోల పొటాషియం 

కోతలు: ప్రతి 60-75 రోజులకు ఒకసారి, 4-5 కోతల్లో 50 టన్నుల దిగుబడి వస్తుంది.

 ఒక ఎకరంలో:

ఖరీఫ్ లో అర ఎకరంలో పలు కోతలలో జొన్నను సాగు చేసుకొని మూడు కోతలలో 20 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. మిగతా అర ఎకరంలో అలసంద (బొబ్బెర) పశుగ్రాసాలపు పంటను రెండు విడతలుగా అంటే జూన్ మెదటి వారంలో ఒక తడవ, మళ్ళి ఆగష్టు మెదటి వారంలో రెండవ విడత విత్తుకొనిన 10 టన్నుల పచ్చి మేత దిగుబడి వస్తుంది.



హైబ్రిడ్ జొన్న సాగు చేయు పద్ధతి:

రకములు: పి.సి.-6, పి.సి.-23, యం.పి.చారి,ఎస్.ఎస్.జి.59-3 

విత్తనాలు హెక్టారుకు: 30-40 కిలోలు

నాటు పద్దతి: సాళ్ళాలో, సాళ్ళ మధ్య 4-5 అంగుళాలు అంతరము 

ఎరువులు హెక్టారుకు: 80 కిలోల నత్రజని,30కిలోల పొటాషియం 

నీటితడులు: 10-15 రోజులకు ఒకసారి 

మెదటికోత సమయం: నాటిన తర్వాత 50-55 రోజులకు (50% పూతలో) 

కోతలు: 3కోతలు, ప్రతి 35-40 రోజులకు ఒక కోత చొప్పున 

దిగుబడి హెక్టారుకు: పచ్చిమేత 70-80 టన్నులు


01.అలసంద సాగు చేయు పద్ధతి:

రకములు: యు.పి.సి.-5286, ఐ.సి.-4216, రష్యన్ అలసంద,బుందేల్ లోబియా 1,2 

విత్తనాలు హెక్టారుకు: 30-40 కిలోలు 

నాటు పద్దతి: వరుసలలో, వరుసల మధ్య అంతరము 30X10 సెం.మీ. 

ఎరువులు హెక్టారుకు: 20 కిలోల నత్రజని,60 కిలోల పొటాషియం 

నీటితడులు: 15-20 రోజులకు ఒకసారి 

మెదటికోత సమయం: నాటిన తర్వాత 60-70 రోజులకు  పూత దశలో 

దిగుబడి హెక్టారుకు: పచ్చిమేత 25-30 టన్నులు, నీటి ఆధారంగా: 20-30 టన్నులు, వర్షాధారంగా 10-15టన్నులు

 

రబీలో: అదే ఎకరంలో రబీలో అర ఎకరంలో జొన్న తర్వాత నవంబరు రెండవ వారంలో పశు గ్రాసపు మొక్కజొన్న పంటను విత్తుకొనిన, మూడు నెలల్లో ఫిబ్రవరిలో 10టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. మిగితా అర ఎకరంలో అలసంద (బొబ్బెర) తర్వాత ల్యుసర్న్ పంటను అక్టోబర్ మొదటి వారంలో విత్తుకొనిన మొదటి కోత 60-65 రోజులకు, తరువాత 25-30తి రోజులకు కోత చొప్పున డిసెంబర్ 25 నుండి కోతలు తీసుకోవచ్చును. సంవత్సరానికి 8-10 కోతలలో అర ఎకరంలో 15టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.

వేసవిలో: రబీలో మెక్కజొన్న పంట తరువాత వేసవిలో ఫిబ్రవరి రెండవ వారంలో సజ్జ పంటను పశుగ్రాసము కొరకు సాగు చేసుకోవచ్చును. తక్కువ నీటి తడులతో, త్వరగా పెరిగి మూడు కోతలలో అధిక పచ్చి మేత దిగుబడినిస్తుంది. అందువల్ల వేసవికి అనువైన పశుగ్రాసపు పంటగా సజ్జను విత్తుకున్నట్లయితే 50రోజులకు మెదటి కోతను, తదుపరి కోతలను 30రోజుల వ్యవధిలో కోసుకోవాలి. మూడు కోతలలో జూన్ వరకు అర ఎకరంలో 15టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.



మొక్క జొన్న సాగు చేయు పద్ధతి:  

రకములు: ఆఫ్రికన్ టాల్,గంగా,హైబ్రిడ్ ఎఫ్,విజయ కిసాన్ 

విత్తనాలు హెక్టారుకు: 40-50 కిలోలు 

నాటు పద్దతి: సాళ్ళాలో, సాళ్ళ మధ్య 10 అంగుళాలు అంతరము 

ఎరువులు హెక్టారుకు: 120 కిలోల నత్రజని,120 కిలోల పొటాషియం 

నీటితడులు: 7-10 రోజులకు ఒకసారి 

మెదటికోత సమయం: నాటిన తర్వాత 60-70 రోజులకు కంకి వేసే సమయంలో 

కోతలు: 2-3కోతలు, 60-70 రోజులకు మొదటి కోత 

దిగుబడి హెక్టారుకు: పచ్చిమేత 50-60 టన్నులు



సజ్జ సాగు చేయు పద్ధతి:  

రకములు: జైంట్ బాజ్రా,జైంట్ రాజ్ కో, ఎ.పి.ఎఫ్.బి. 

విత్తనాలు హెక్టారుకు: 15-20 కిలోలు

నాటు పద్దతి: సాళ్ళాలో, సాళ్ళ మధ్య 5 అంగుళాలు అంతరము 

ఎరువులు హెక్టారుకు: 80 కిలోల నత్రజని,30 కిలోల పొటాషియం 

నీటితడులు: 15-20 రోజులకు ఒకసారి 

మెదటికోత సమయం: నాటిన తర్వాత 60-70 రోజులకు

కోతలు: 1-2కోతలు, 30-35 రోజులకు ఒక కోత  

దిగుబడి హెక్టారుకు: పచ్చిమేత 25-30 టన్నులు

ఈ విధంగా 2.5 ఎకరాలలో 190 టన్నుల పలురకాల పశు’గ్రాసాలని పొందవచ్చు. 10 పాడి పశువులకు, 5 దూడలకు కావలసిన పచ్చిమేత 173 టన్నులు పోగా 17 టన్నుల పశు గ్రాసాన్ని మాగుడు గడ్డిగా (సైలేజి) భూమిలో పాతర వేసి నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా అవసరాని మేరకు ఎండబెట్టి “హే”గడ్డిగా కూడా నిల్వ చేసుకోవచ్చు.

 



 


 

 

No comments:

Post a Comment

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...