Tuesday, March 29, 2022

వేసవిలో పశువుల యాజమాన్యం

 

ఎండ పూట పశువులు జాగ్రత్త



ఈ సారి వేసవిప్రారంభం కాకముందే పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 350-400 సెంటిగ్రేడ్లు నమోదు అవుతున్నాయి, వేసవి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఎక్కువగా నమెదు అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలుపడం జరిగింది. వేసవికాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వలన ఉష్నతాపానికిగురై పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికిలోను కావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఆవులు కంటే గేదెలు ఉష్నతాపానికి ఎక్కువగా గురవుతాయి. గేదెలు నలుపు వర్ణంలో ఉండటంవలన నలుపు ఉత్తమ ఉష్ణగ్రహకము కావడము వలన ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశుపోషకులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే,పాడిపశువులు అనారోగ్యానికి గురికాకుండా వడదెబ్బబారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువులను శాస్రియ యాజమాన్య పద్దతిలో పెంచడం వలన వాటి ఉద్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

పశువులలో వడదెబ్బ:

·         అధిక ఉషోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువుల షెడ్లలో అధికసంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన పశువు వడదెబ్బకు గురవుతుంది. దాహం పెరుగుతుంది. పశువు తూలుతూనడుస్తు పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొకసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణిస్తాయి.


పశువులలో ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది....?

·         పశువు శరీర ఉష్ణోగ్రత 38 – 39.30c.  అయిన పాడి పశువుల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 270c మాత్రమే. ఈ ఉష్ణోగ్రతకు మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్నతాపానికి గురవుతాయి.

·         దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నోటినుండి చొంగకారుతుంది. జీర్ణక్రియకు నెమరువేయడానికి కావలిసిన లాలాజలం లభించదు. ముట్టే ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండటంతో ఎక్కువనీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఎలోక్ట్రోలైట్స్ నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా పోస్తుంది. శ్వాస,గుండె, నాడీ వేగం పెరుగుతుంది.



   

·         మేత సరిగా తినక పోవడం వలన శరీరంలో గ్లూకోజ్ నిలువలు తగ్గిపోతాయి.పశువు క్రమంగా నిరసించి, బలహీనంగా మారతాయి. పశువు సరిగ్గా నడవలేక తూలుతూపడుకోవడానికి ప్రయతిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహరం తక్కువగా తిసుకోవడం వలన పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.

·          వ్యాది నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది.  పునరుత్పత్తి సామర్థ్యం మందగించును. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటలలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి.

·          అధిక వేడివల్ల హార్మోన్ల ఉత్పత్తి-సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది. చూడి పశువులలో గర్భస్రావాలు సంభవించె అవకాశాలున్నాయు. పశువులు  సకాలంలో ఎదకురావు, వచ్చిన ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు.చూలు కట్టే అవకాశం తగ్గుతుంది. ఈతల మద్య కాలం పెరుగుతుంది. పునరుత్పత్తి సక్రమంగా ఉండదు.

వడదెబ్బకు గురైనపశువులకు ప్రథమచికిత్స ఎలా చేయాలి.........?

·         వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగటం, తల నుదుటి మీద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనే సంచిని దానిపై కప్పాలి. వెంటనే పశువైద్యున్ని సంప్రదించలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లుకోస్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి  సోడియం సలిసిలైట్, పారసిటమాల్ ఇంజక్షన్లు వేయించాలి.

వేసవి యాజమాన్య పద్దతులు : శాస్రియ యాజమాన్య పద్దతిలో పెంచడం వలన పశువుల ఉద్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువుల పాకాల నిర్మాణంలో మరియు సదుపాయాలలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది.

·         ఎండ తీవ్రత నుండి రక్షించడానికి పశువుల పాకను ఎతైన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకాల ఎత్తు 12-14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘఅక్షం తూర్పుపడమరలుగా నిర్మించుకోవాలి. పాకాల చుట్టూ సుబాబుల్, అవిశ చెట్లను నాటడం వలన నీడతో పాటు పశుగ్రాసం లభిస్తుంది.

·         పాకాల పైకప్పుభాగాన తాటాకుతోగాని వరి గడ్డితో గాని కప్పి తరచు తడుపుతూ ఉండాలి. పాకలను కడగడం, చుట్టూ పరిసరాలలో నీళ్ళు చల్లడం వల్ల షెడ్డు లోపలి వాతావరణం చల్లగాఉంటుంది. చల్లని నీటితో పశువుల్ని రోజుకు 2-3సార్లు కడగాలి. శుభ్రమైన చల్లని త్రాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.

·         రైతు ఆర్దిక స్థోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడాఏర్పాటుచేసుకోవచ్చు. కప్పుపై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి.

   





     

వేసవిలో మేత: వేసవికాలంలో  పశువులు ఉష్ణోగ్రతలతో రైతు కరువుతో పోరాడవలసి వస్తుంది. రైతు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుగానే పశు గ్రాసాలని పెంచడం లేదా ఎండుగడ్డి, పాతర గడ్డిరూపంలో  నిల్వచేసుకున్నట్లయితే ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. ఇవి అందుబాటులో లేనప్పుడు హైడ్రోఫోనిక్స్ రూపంలోనైన అందించవలసి ఉంటుంది.

·         ఎండవేడివల్ల పాడిపశువు ఎక్కువగా మేత తినలేదు. వేసవితాపంతో జీర్ణక్రియ, సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జిర్ణించుకునే పిండిపదార్తలైన గంజి, జావా లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది.

·         ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్దిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాలలో ఎండుగడ్డిని రాత్రిసమయాలలో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చేపశువులకు పశు దాణ నీటితో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణ ఇవ్వడంవలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకుర్చవచ్చు.  మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది.

·         మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉదయంపూట 6 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు మేత కొరకు పశువులను బయటకు పంపడం మంచిది.






   

ఆరోగ్య పరిరక్షణ:

·         వ్యాదినిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉండి కావున నివారణకై పశువులలో ముందుగానే గాలికుంటు వ్యాది, గొంతువాపు, జబ్బవాపు వ్యాది నివారణ టీకాలు వేయించాలి.

·         దాహంతో ఉన్నపశువులు మురుగునీరు త్రాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది కావున ఎల్లవేళల మంచి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలి.

·         అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమంతప్పకుండా త్రాగించాలి.బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ మందు తగుపాళ్ళలో నీటిలో కలిపి పశువుశరీరంపై పిచికారిచేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

పశుపోషకులు ముందుగానే పై జాగ్రత్తలు పాటించడం వలన పశువుల ఆరోగ్యంకాపాడటంతోపాటు, పాల దిగుబడితగ్గకుండా, ఆర్దికంగా నష్టంవాటిల్లకుండా చూడవచ్చు.  రైతు ఈ సమయంలో పెట్టెఅదనపు ఖర్చు పశువుల ఉద్పాదక తగ్గకుండా చూడడం వల్ల రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా మన వాతావరణ పరిస్థితులను ఎదుర్కునే సహివాల్, రెడ్ సింది, కంక్రేజ్ మరియు ఓంగోల్  వంటి దేశీయ పశుజాతులను అభివృద్ధి చేయడం  చాలా అవసరం. అలగే ప్రాంతీయ నాసిరకం పశువులను మేలైన దేశీయ పశుజాతుల వీర్యంతో కృత్రిమ గర్భదారణ చేయించడం మంచిది.

 





1 comment:

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...